చిన్నారీ తుషారా
చాలా కాలమయిపోయింది కదూ నిన్నిలా పిలిచి. అలా పిలవాల్సిన అవసరం, అవకాశం ఈ మధ్య మనమధ్య రానిదే.
ఎలా వున్నావు తల్లీ... మొన్న నువ్వు పాపాయితో తీయించుకొని పంపించిన ఫొటోలు చూశాను.
పాపాయి తప్పటడుగులు వేస్తోంది కదూ. మీరిద్దరూ చెరో చెయ్యి పట్టుకొని దాన్ని నడిపిస్తున్న ఫొటో ఎంత అందంగా ఉందో. దాన్ని ప్రింటుతీసి పెద్దగా బ్లో అప్ చేసి పెట్టాడు తమ్ముడు. హాలులో ఆ ఫొటో ఎంత నిండుగా ఉందో తెల్సా.
ఈమధ్య నీకు పని ఎక్కువగా ఉండి తీరిక తగ్గిపోయినట్టుంది కదూ. ఈమెయిల్స్ రాయడం లేదు, ఫోన్లు తగ్గిపోయాయి.
ఫోన్ చేస్తావు కానీ ఆ కాస్సేపూ ఎవరో వెంటపడి తరుముతున్నట్టు గబగబ మాట్లాడేస్తావు. ఎప్పుడూ ఉండే ప్రశ్నలూ జవాబులూ ఆ కాసేపు సమయాన్నీ తినేస్తాయి. అమ్మా బావున్నావా, నాన్న బావున్నారా, తమ్ముడు బాగున్నాడా...మేము బాగున్నాం, పాప బాగుంది.. కబుర్లు చెప్తోంది. అంటావు. ఎవరో వస్తున్న అలికిడి అయినట్టుగా ఆ ...వస్తున్నా.. అంటావు. అమ్మా మళ్ళీ చేస్తానమ్మా అనిఫోన్ పెట్టేస్తావు. నీనుంచి ఫోన్ వచ్చిందన్న ఆనందం గుప్పుమని ఆరిపోడానికి అరనిమిషం పట్టదు.
పోనీ వెబ్ కెమేరాలో మిమ్మల్ని చూద్దామన్నా అది పాడయిందనో, ఇప్పుడు కుదరదనో, ఎవరో ఉన్నారు ...మరోసారి అనో దాటేస్తున్నావు. కారణం నువ్వు చెప్తే తప్ప కనుక్కోలేనంత పిచ్చిదాన్ని కాదే.
మీఅంత చదువులు కాలేజీలో చదువుకోకపోయినా జీవితంలో నీకన్నా ముందు కొన్ని ఘట్టాలు దాటి వచ్చిన అనుభవం నాకు లేదూ.. అది చాలు- నీ జీవితంలో జరుగుతున్న విషయాలను ఊహించడానికి.
చిన్నా... మీ అత్తగారు,మామగారు ఎలాఉన్నారు. ఇంకా ఎన్నాళ్ళుంటారు. ఇది మామూలుగా వేస్తున్న ప్రశ్న కాదు.
వాళ్ళు వెళ్ళాక అయినా నువ్వుతేరుకొని మామూలు మనిషివవడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసుకోవడానికి ఇలా అడుగుతున్నాను.
ఇలా అడుగుతున్నందుకు నాకు చాలా బాధగానే ఉంది. తల్లిదండ్రులుగా వారి కొడుకు దగ్గర కావలసినన్నాళ్ళు ఉండే స్వేచ్ఛ, హక్కువారికి సహజంగా ఉన్నవే. కానీ వారి ఉనికి మీ కాపురానికి, మీ వైవాహిక జీవితానికి ప్రశ్నార్థకంగా నిలిచినప్పుడు ఇలా అడగడంలో తప్పులేదని కూడా సమర్థించుకోవాలనిపిస్తుంది.
పెళ్ళినాడే ఆ మనుషుల తత్త్వాలు, వారి బంధువులను సమర్థించి మన తప్పులను ఎత్తిచూపడంలో అర్థం అయినా, ఇంత త్వరలో నువ్వు వాళ్ల పాలబడతావనుకోలేదు. అమెరికా వాళ్ళు వాళ్ల సంస్కారం ఎంతో ఉన్నతంగా ఉంటుందనుకున్నాం.తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం అన్నట్టు చదువులు, నాగరికతలు వేరు, సంస్కారాలు వేరు అన్న తీరుగా ఉన్నారు... మీ అత్తమామలు, అల్లుడితో సహా. ఇలా అంటున్నానని మనసు కష్ట పెట్టుకోకు. ఒక నిజాన్ని దాచడం కన్నా ఒప్పుకోవడంలోనే సుఖం ఉంది. ఇన్నాళ్లూ ఇలాటి నిజాలు ఒప్పుకోవడానికి ధైర్యం చాలక మనలో మనం కూడా మనసులు విప్పి చెప్పుకోలేకపోయాం.
కానీ చిన్నా... అంతంత ఖర్చు పెట్టి ఆడపిల్లలను ఊరుకాని ఊర్లు పంపించి హాస్టల్లో ఉంచి చదివించే దెందుకో తెలుసునా.. మా కాలం కన్నా మీ కాలంలో మీ వ్యక్తిత్వాన్ని ఉన్నంతంగా దిద్దుకొని, ఆడదంటే అబల, చేతకానిది లాటి నిర్వచనాలని తప్పని నిరూపిస్తారన్న ఆశతో.చదువు మీకు జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యాన్నిస్తుందని, మీ స్వంత కాళ్లమీద నిలబడి మీ జీవితాన్ని మీరే శాసించగలిగే అవకాశం వస్తుందని. డబ్బుఇబ్బందులెన్ని ఉన్నా నగలు,భూములు ఏముంటే అవి అమ్ముకొనో, తాకట్టు పెట్టుకొనో, ఎక్కడ సీటు వస్తే అక్కడ చదివించేది అందుకే.ఎంత చదివించినా ఆ వయసు వచ్చేసరికి ఓ అయ్యచేతిలో పెట్టడం తప్పదు. దానికి పెళ్ళి అన్న లక్షలు ఖర్చయ్యే తంతూ తప్పదు. వచ్చే తరానికయినా వారంతట వారుగా ఇష్టమయిన వారిని వాళ్ళే చేసుకోగలిగితే ఈ కట్నం బాధలుండవు కదూ.
కానీ నాకర్థం కానిదొకటుంది. మా తరంలో పుస్తకాలు,నవలలు,నాటకాలు అన్ని ప్రక్రియలలోను వరకట్నం ఇవ్వడం దురాచారం అనీ దాన్ని ఖండించాలని, కట్నం తీసుకోనివాడినే చేసుకోవాలని ప్రతిజ్ఞలుచేసుకోవడంఉండేది.
చాలా మంది దాన్ని ఆదర్శంగా స్వీకరించి పాటించారు కూడా. నేను , మీ నాన్న పెద్దలు కుదిర్చిన పెళ్ళే అయినా పెళ్ళికి ముందు వరకట్నంవిషయంలో కాని, పెళ్ళికి వృధాగా ఖర్చుపెట్టడం విషయంలో కాని ఆదర్శ వివాహం ఎలా ఉండాలో అలాగే చేసుకోవాలని నిర్ణయించుకొని పెద్దవాళ్ళకి చెప్పాం. మానిర్ణయాన్ని వాళ్ళు హర్షించారు కూడా.
కానీ ఇప్పటి పిల్లలలో ఇలా వరకట్నం దురాచారమన్న స్పృహకనిపించదేం. అమెరికాలు, యూరోపులు తిరిగి ఎంతో ప్రపంచాన్ని, మానవజీవితాన్ని, దేశదేశాల ప్రజల ఆచార వ్యవహారాలను గమనించి వచ్చి కూడా అమ్మ చాటు పిల్లవాడిలా నాన్నమాటే వేదవాక్కులా పెళ్ళి విషయంలో ఏమాత్రం చొరవ చూపించరేం. అవన్నీ తమకి సంబంధించనట్టు పెళ్ళికి వేసుకోవలసిన బట్టల మీద, హనిమూన్ కి ఎక్కడెక్కడికి వెళ్ళడం మీద మాత్రమే దృష్టి పెడుతున్నారేం. ఆడపిల్లలూ అంతే. రిసెప్షన్ కి ఏంచీర,ఏం నగలు, ఆ దేశం వెళ్తే ఏం బట్టలు ఇలా మాత్రమే ఆలోచిస్తున్నారు. తమ రెండుజీవితాలు ఆనందంగా ముడిపడడానికి ఎంత ఖర్చు వృధా అవుతోంది. దాన్ని మరోక రకంగా సద్వినియోగం చేసుకోవచ్చునన్న ఆలోచన ఎంతమందికి ఉంది.
సరే...ఇవన్నీ ఇప్పుడెందుకు అంటున్నానంటావా... నీ పెళ్ళి విషయం కూడా నాలో అంత అసంతృప్తినే మిగిల్చింది కనుక.
ఇంత చదువుకొని హాయిగా ఉద్యోగం చేసుకొని స్వతంత్రంగా బ్రతుకుతావని ఆశపడ్డాను. అమ్మాయి ఉద్యోగం చేయడానికి వీల్లేదని ఆంక్ష పెట్టారని తెలిసీ, అమెరికా సంబంధం మీద మోజు పడి పెళ్ళి కి సై అన్నావు. అమెరికా సంబంధం అని అందరూ ఆకాశానికెత్తేసినా నా భయాలు నన్నెప్పుడూ వదలలేదు.
నువ్వు ఉద్యోగంలో చేరానంటూ రాసిన మెయిల్, నన్ను సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేసింది. కానీ ఇంటిపనులు ఒక్కదానివీ చేసుకోలేకపోతున్నానని, అందరికీ అమర్చి బయటికి వెళ్ళడం, మళ్ళీ ఇంటికివచ్చి చేసుకోవడం ఎవరి సహాయంలేకపోగా లోపాలు ఎంచుతారని నీకు మనసు కష్టంగా ఉందని అర్థం అయాక ఎంత నలిగిపోయానో. పాపాయిని కడుపుతో ఉన్నావని తెలిసాక నిన్ను చూడకుండా ఉండడం ఎంత కష్టమయిందో. నీదగ్గరకి వచ్చి పురుడు పొయ్యాలని ఎంత ఆశపడ్డాను. అన్నిటికీ మీ అత్తగారున్నారు అవసరం లేదన్నావు. అవసరం కాదక్కడి ప్రశ్న.నిన్ను చూడగలిగే అవకాశం.మనవరాలిని పొత్తిళ్ళలో చూసుకొని ఆనందించే అవకాశం రానేలేదు.అప్పుడప్పుడూ నువ్వు పంపే ఫొటోల్లోనే దానిని చూసుకుంటూ తృప్తిపడవలసివస్తోంది.
మొన్నటి ఫోటోలలో నిన్ను చూస్తే ఇటీవల నీలో ఎంత మార్పు వచ్చిందో తెలుస్తోంది.ఎంతగా చిక్కిపోయావో.
ఎప్పుడు లావుగా ఉన్నావుకనుక...లేతతమలపాకు తీగలా ఉంటావు అనేది కదూ అమ్మమ్మ. పాపాయిని బొజ్జలో మోస్తున్నప్పుడు కొద్దిగా మార్పు కనిపించింది. బొద్దుగా ముద్దుగా తయారయేవనుకున్నాను. మళ్లీ చిక్కిపోయావన్నమాట.కానీ ఈ చిక్కడంలో నా కళ్ళకేదో తేడా తెలుస్తోంది. అమ్మ నన్నెప్పుడూ అలాగే అంటుంది అనుకొని కొట్టిపారేయకు. కళ్ళకిందనల్లటివలయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చేతులు ఇదివరకటి కంటే పుల్లల్లా తయారయ్యాయి.పాపాయి పనులు చూసుకుంటూ నిన్ను నువ్వు పట్టించుకోవడంలేదు.
కానీ ఈ మార్పు కేవలం శరీరానికి సంబంధించనదైతే కొంతఫర్వాలేదు. కానీ అది మనసుకి సంబంధించినదని నాకు బాగా తెలుస్తోంది. నీ మాటతీరులో ఇదివరకటి ఉత్సాహం లేదు. ఏం జరుగుతోంది అక్కడం. నాకు పగలూ, రాత్రి ఇదే ఆలోచన. నేను ఇంత దూరంగా ఉండిపోయాను. కావలసినప్పుడు నిన్ను చూడలేను. పోనీ ఫోన్లో పలకరిద్దామంటే ఫోన్ కట్ చేసేస్తున్నట్టు ఆఫ్ అయిపోతోంది. సెల్ నీదగ్గర లేదన్నావు కదా.. మీ అత్తగారు కట్ చేసేస్తున్నట్టున్నారు.
నువ్వు నీ అంత నువ్వు చేస్తే గానీ మేము మాట్లాడలేము. నాకు నరకంగా ఉంది ఈ పరిస్థితి తలుచుకుంటే. ఎటూ పాలుపోవడం లేదు.
నేనేం చెయ్యను... ఏం చెయ్యగలను. కానీ... చిన్నారీ... పరిస్థితులు చక్కదిద్దుకోవడం నీకనుకూలంగా మార్చుకోవడం నీ చేతుల్లో లేదంటావా... మనిషికి అన్నింటికన్నా ముఖ్యమైనది స్వాతంత్ర్యం. అది లేని బ్రతుకు జీవచ్ఛవం కాదూ..నాకు స్వతంత్రం లేదు అని నువ్వు పదే పదే అనే మాట. స్వతంత్రం ఎవరూ మనకు ఇవ్వరు. అది మన హక్కు. పోరాడైనా సాధించుకోవలసిన హక్కు. పోరాడితే పోయేది ఏమీలేదు, బంధాలు తప్ప. నీకు స్వతంత్రం కావాలా ఇంద అని ఏ కుటుంబలోను ఆడదానికి ఇవ్వరు. తన జీవితం ఎలా ఉండాలి, తనకి కావలసినట్టు జీవించగలగాలంటే ఏంచెయ్యాలి అని ఆడపిల్లలు తెలుసుకోగలగాలి. అత్తమామల ఇంట్లో ఒద్దికగా ఉండాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి, భర్తతో గొడవ పడకూడదు అని అందరు ఆడపిల్లలకి తల్లిదండ్రులు చెప్పేమాట. తప్పులేదు. అలా అనుకొనే నేనూ చెప్పాను. కానీ వాళ్లు నీతో సేవలందుకోవడమే కాని, మనిషిగా గుర్తించకుండా ఉన్నప్పుడు, నీ ఆత్మాభిమానం దెబ్బతినేలా మాటలతూటాలు విసురుతున్నప్పుడు నోరెత్తకుండా పడి ఉండాలని అనుకోవడంలో ఏ మాత్రం అర్థముంది.
పాపాయి కోసం ఇవన్నీ భరిస్తున్నావా.... కానీ రేపు ఆ పాపాయికి కూడా నీ మీద గౌరవం లేక పోయినా ఆశ్చర్యం లేదు తెలుసా.వ్యక్తిత్వం లేని మనిషిగా నీ మీద దానికి అభిప్రాయం ఏర్పడిన నాడు అది కూడా నిన్ను లెక్కచెయ్యదు. తల్లి తండ్రులమధ్య పటిష్టమైన మానసికమైన సంబంధం లేదని గ్రహించిందా, మీ ఇద్దరిమీదా గౌరవం ఉండదు.
అందుకే చెప్తున్నా.... భరించకు. ఓర్పుకు హద్దుంటుంది. అది నీ సంసారం. నువ్వే చక్కదిద్దుకోవాలి. మూడో వ్యక్తి ప్రమేయాన్ని భరించవలసిన అవసరం లేదు. అది నేనైనా, నాన్నైనా, మీ అత్తగారైనా, మామగారైనా.కుటుంబ గౌరవం పేరుతో నీ ఆత్మగౌరవానికి భంగం కలిగించుకోకు. ముందు నీకేం కావాలో నువ్వు స్పష్టంగా నిర్ణయించుకో. దానిని సాధించడానికి ప్రయత్నించు. కన్నీళ్ళు పెట్టుకోకు. ముఖ్యంగా మగవాళ్లు కన్నీటికి ఆమడదూరాన ఉంటారు. అది మన కంట్లో వాళ్లు చూడలేరు. సానుభూతి వలన కాదు - ఆ కన్నీళ్లకి వాళ్లు కారణం అని అనుకోవడం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు కనుక. మనం ఆ మాట అనేస్తామేమోనన్న భయం. అందుకని కళ్ళలో నీళ్ళు తుడిచేయ్. చెప్పదలచుకున్నది ఏడుపుగొంతుతో కాక స్పష్టంగా గట్టిగా చెప్పు. ఆఫీసునుంచి రాగానే కంప్లైంట్స్ చెయ్యకు. నీ కష్టాన్ని ఇంకెవరితో పంచుకోవాలి అని అడుగుతావు. నిజమే. కానీ నువ్వు నేరారోపణ చేస్తున్న వ్యక్తి అతని తల్లి, లేదా తండ్రి. వారి విషయంలో ఏది చెప్పినా అతను నీకనుకూలంగా రియాక్టు అవడు, అవలేడు. అందుకే సమయం చూసి ఓపిగ్గా ఉన్నప్పుడే చెప్పు. ముఖ్యంగా కడుపు నిండాక గానీ ఇలాంటి వ్యవహారాలు తర్కించకు.ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు మనిషి విచక్షణ సరిగా పనిచేయదు. అవతలి వారి వివరణ విన్నాక మళ్ళీ ప్రశ్నలు వెయ్యి కానీ గబగబా మాటలు అనేయకు. ఇవన్నీ నీకు తెలిసిన విషయాలే కావచ్చుకానీ తొందరపడి ఆవేశంలో మాటలనుకొని తెగేవరకు లాగకుండా పండంటి కాపురాన్ని నిలుపుకోవాలని ఇవన్నీ చెప్తున్నాను. కానీ అందుకోసం నీ ఆత్మాభిమానం పణంగా పెట్టి నీ కిష్టంలేని జీవితాన్ని భరించకు. నువ్వు వంటరిగా ఉన్నావని ఎప్పుడూ అనుకోకు. అనుక్షణం నీ గురించే ఆలోచించే మేమంతా ఉన్నాం. నిన్ను నా గుండెలలో పెట్టుకుంటాను. నువ్వెప్పటికీ నా చిన్నారివే.
జీవితం అపురూపమైన వరం. దాన్ని ఆనందోత్సాహాలతో నింపుకొని సరదాగా గడుపుకోవాలి. జీవితమనే పెద్ద గీత ముందు ఈ చికాకులన్నీ చిన్న గీతలే. అన్నీ తేలిపోతాయి. నువ్వు సంతోషంగా నవ్వుతూ ఫోన్లో చెప్పే కబుర్ల కోసం ఎదురుచూస్తూ ఉంటాను. నీ నవ్వులు పాపాయి బోసినవ్వుల్లో కనిపిస్తాయిలే. నిన్ను చూడాలని , పాపాయి అమ్మమ్మా అని పిలిచే పిలుపు వినాలని ఎదురుచూస్తున్నాను. ఎప్పుడు చూస్తానో మరి.
ఉంటాను.
అమ్మ
12, జులై 2008, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
16 కామెంట్‌లు:
చాలా బాగా వ్రాశారండీ.. ఇంతకంటే మాటలు రావట్లేదు..
చాలా బాగా వ్రాశారు, చివరలో మీరు వ్రాసిన మాటలు అందరికీ ఆచరణీయాలు...
చాలా బాగుంది. బహుశ ఇది చిన్న మాటే. వాదాలను పక్కన పెట్టి చుస్తే, నాకు తల్లి హృదయం కనిపించింది. చాలా చక్కగ తల్లి హృదయాన్ని ఆవిష్కరించారు....అభినందలనతో..
నాకీ లేఖలో పదాలకన్నా, వాక్యాలకన్నా అమ్మ మనస్సు ఎక్కువ కనపడుతోంది.
అమ్మ మనసుకి అందమైన చిత్రణ
దశాబ్దాలుగా, శతాబ్దాలుగా, తరతరాలుగ మనిషికి వున్న అనుభవం ఎక్కడికి పోతోంది?
మనిషికి తోటి మనిషిని కనిసం సొంత మనిషిని ప్రేమించటం తెలియదా? తన సర్వస్వం విడిచి పెట్టి నీకోసం వచ్చే ఆ అమ్మాయి నీ అమ్మ లాంటి మరో ఆడది కాదా? నీ తోబుట్టువు లాంటి ఆశలు తనకుండకూడదా? అమ్మను ప్రేమించాలంటే, భార్యను కసాయిగా హింసించాలా?
అమ్మాయిలూ, మీరు ఇంకా మారలేదు. మొగుడు దేవుడని చెప్పిన పెద్దలు, భర్యని దేవతగా చూసుకుంటారనే. ఆ మొగుడు రాక్షసుడైనప్పుడు మీరు కాళికగా మారాలి. ఇది మీకే కాదు మీ కాబోయే కోడలికి కూడా వర్తిస్తుంది.
అబ్బాయిలూ, మీరూ మారండి. అమ్మ, ఆలి ఎవరో ఒకరే కాదు జీవితం. ఇద్దరూ రెండు కళ్ళు. ఏ కన్ను పొడుచుకున్నా నష్టం మీకే.
చాలా సందేదనాత్మకంగా చెప్పారు. అక్కడక్కడా చదువుతుంటే, నా గుండె గొంతుకలోకొచ్చి కొట్టుకులాడినట్టనిపించింది.
నిజమే,"చదువులు, నాగరికతలు వేరు, సంస్కారాలు వేరు". లక్షలు సంపాదిస్తున్న అమెరికా అబ్బాయి కోట్లలో కట్నం తీసుకుంటాడు.అమెరికాలో ఉన్నా యూరప్ లో ఉన్నా మగాడు ముఖ్యంగా ఆంధ్ర మగాడు ఇటు పురుషాహంకారమూ వీడడు, భార్యకు గౌరవమూ ఇవ్వడు.
ఎప్పుడు మార్పొస్తుందో!
చాలా చాలా అద్భుతంగా ఉంది.
అసలు ఈ ఫార్మెట్లో (ఉత్తర రూపంలో) వచనాన్ని చదివి ఎన్నేళ్లయిందో.
బొల్లోజు బాబా
చాలా బాగుందండీ...
అందరికీ కృతజ్ఞతలు-రాసిన రెండుటపాలను చదివిన వెంటనే మీ వ్యాఖ్యలు పంపినందుకు.ఇంకా ఇంకా రాయాలనే ఉత్సాహాన్ని నింపుతున్నందుకు.
ఎక్కడ కృతజ్ఞతలను చెప్పుకోవాలో తెలియని అజ్ఞానం వల్ల మొదటి పోస్టుకు స్పందించిన వారికి చెప్పుకోలేక పోయాను..మరోసారి మీ(మన)భాషలో నెనర్లు..
ప్రతి తల్లీ ప్రతి కూతురికీ చెప్పాల్సిన మాటలు.
చాలా సంతోషం.
వ్యాఖ్యాతలకి ధన్యవాదాలు చెప్పడానికి మీరు ఇప్పుడు పాటించిన పద్ధతి సరైనదే.
మీరు మరిన్ని మంచి టపాలు రాస్తారని ఆశిస్తూ
టపాలో ఆర్ద్రత కదిలించేస్తోంది.
టపాలో, వ్యాఖ్యలలో నన్ను ఆలోచింపచేసిన మాటలు:
"జీవితమనే పెద్ద గీత ముందు ఈ చికాకులన్నీ చిన్న గీతలే."
"అబ్బాయిలూ, మీరూ మారండి. అమ్మ, ఆలి ఎవరో ఒకరే కాదు జీవితం. ఇద్దరూ రెండు కళ్ళు. ఏ కన్ను పొడుచుకున్నా నష్టం మీకే."
కొన్ని ప్రశ్నలు:
ఆ అమ్మాయి దేనికి భయపడుతోంది?
ఆ అత్తమామలు దేనికి భయపడి ఆమెను కట్టడి చేస్తున్నారు?
పరిస్థితుల పై అత్త మామల ప్రభావం ఎంత? అబ్బాయి ప్రమేయం ఎంత?
ఆత్మాభిమానం అంటే ఏమిటి? (ఆడా మగా ఇద్దరికీ)
పెళ్ళికి పరమార్థం ఏమిటి? (ఆడా మగా ఇద్దరికీ, ఇరువైపుల కుటుంబాలకీను)
చాలా చక్కగ తల్లి హృదయాన్ని ఆవిష్కరించారు....అభినందలనతో..
WOW!!
అమ్మే తొలి గురువు అంటారు కదా... ఇన్ని చదివినా.. రాజ్యాలేలుతున్నా... "నీకు నువ్వు ముఖ్యం.. ఆ తర్వాతే ఎవరైనా" అన్న పాఠం కూడా అమ్మనుండి రావాల్సిందేమో. ప్రేమతో వేసినా.. బాధ్యతతో వేసినా.. సంకెళ్ళను తెంచుకోవాలి గాని.. అలానే ఉండనీయకూడదు.. ఎంతటి "అందమైన" పేరుతో!!
నా అలోచనలకు.. చాలా చాలా దగ్గరగా ఉన్నాయి మీవి. ఇది ప్రచురించినందుకు.. కృతజ్ఞతలు!!
maro kanneeti gadha ni inka adbhutamga raasi nannedipinchavu..good ..manchi counsellor avagalavu..i am proud of u..
kadhanam chala bagundi.Nijanga jarugutunnaya ani anipistondi. Lekhalo Talli Ardrata vundi Avedana vundi .Talli badhyataga salahalu bagunnayi. Chala baga raseru.Tappakunda prati talli dandrulu atta mamalu chadavalsina kadha.
కామెంట్‌ను పోస్ట్ చేయండి